Sampoorna Ramayanam Part 32 | సంపూర్ణ రామాయణం - సుందరకాండ - రోజు 32 | అశోకవన విధ్వంసం
Sampoorna Ramayanam Part 32 | సంపూర్ణ రామాయణం - సుందరకాండ - రోజు 32 అశోకవన విధ్వంసం
🚩 సంపూర్ణ రామాయణం - సుందరకాండ - రోజు 32 🚩
ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏
ఓం ఆంజనేయాయ నమః 🙏
కథా వివరణ
అశోకవన విధ్వంసం:
సీతమ్మను చూసిన కార్యసాఫల్యంతో వెనుదిరగాల్సిన హనుమంతుడు, కేవలం సీతమ్మ క్షేమ సమాచారం తీసుకువెళితే సరిపోదని భావించాడు.రాబోయే యుద్ధం కోసం రావణుని సైనిక బలాన్ని, పరాక్రమాన్ని అంచనా వేయాలనుకుంటాడు. దాని కోసం శత్రువును కవ్వించడానికి,లంకలో రావణుడికి అత్యంత ఇష్టమైన 'అశోకవనాన్ని' ధ్వంసం చేయడం ప్రారంబించాడు.
సీతమ్మ ఆశ్రయం పొందిన శింశుపా వృక్షాన్ని మాత్రం వదిలేసి, మిగతా వనాన్నంతా సర్వనాశనం చేస్తాడు.
కింకరులు, అక్షకుమారుల వధ:
కొందరు రాక్షస స్త్రీలు అక్కడే సీతమ్మ కు కాపలా ఉండి మిగతావారు వనం ధ్వంసమవుతున్న విషయం రావణుడికి చెప్పటానికి వెళ్ళారు.విషయం తెలుసుకున్న రావణుడు ఆగ్రహంతో 80 వేల మంది 'కింకరులు' అనే రాక్షస వీరులను పంపుతాడు. హనుమంతుడు ఒక ఇనుప పరిఘను (గుదిబండను) తీసుకుని వారందరినీ మట్టికరిపిస్తాడు.
బ్రతికి పోయిన కొందరు రావణుని వద్దకు పరుగున పోయి జరిగిన మారణకాండ వివరించి చెప్తే, రావణుని నేత్రాలు క్రోధంతో ఎరుపెక్కి పోయాయి. వెంటనే అత్యంత శక్తివంతుడు అయిన ప్రహస్తుని కుమారుడు జంబుమాలి నీ,ఏడుగురు మంత్రి కుమారులను, ఐదుగురు సేనాధిపతులను వరసగా పంపగా హనుమంతుడు తన ఘర్జన తోనే వారీ గుండెల్లో దడ పుట్టిస్తు వారిని సంహరించాడు.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ||
దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
(సుందరకాండ - 42వ సర్గ)
తాత్పర్యం:
అత్యంత బలవంతుడైన శ్రీరామునికి జయం కలుగుగాక! మహాబలుడైన లక్ష్మణునికి జయం కలుగుగాక! శ్రీరాముని రక్షణలో ఉన్న సుగ్రీవ మహారాజుకు జయం కలుగుగాక! అసాధ్యమైన కార్యాలను సైతం సాధించే కోసలేంద్రుడైన శ్రీరాముని దాసుడిని నేను. శత్రు సైన్యాలను నాశనం చేసే వాయుదేవుని పుత్రుడైన 'హనుమంతుడిని' నేను! (రాక్షసులను గడగడలాడిస్తూ హనుమంతుడు చేసిన సింహనాదం ఇది).ఇది మహా మంత్రం సకల కార్య సిద్ధినీ కలిగిస్తుంది నిత్యం పారాయణ చేయవచ్చు.
... ఇలా ఎవరు వచ్చినా హనుమంతుని చేతిలో హతమవుతారు. చివరకు రావణుడు తన చిన్న కుమారుడైన, మహావీరుడైన 'అక్షకుమారుని' పంపుతాడు. ఆకాశంలో జరిగిన భీకర యుద్ధంలో హనుమంతుడు అక్షకుమారుని రథాన్ని విరిచి, వాడి కాళ్ళను పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సంహరిస్తాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం:
పుత్రశోకంతో రగిలిపోయిన రావణుడు, అజేయుడైన తన పెద్ద కుమారుడు 'ఇంద్రజిత్తును' (మేఘనాథుడిని) యుద్ధానికి పంపుతాడు. ఇంద్రజిత్తుకు, హనుమంతుడికి మధ్య మహా సంగ్రామం జరుగుతుంది. వానరుడిని సాధారణ అస్త్రాలతో బంధించలేనని గ్రహించిన ఇంద్రజిత్తు, అత్యంత శక్తివంతమైన 'బ్రహ్మాస్త్రాన్ని' ప్రయోగిస్తాడు. బ్రహ్మదేవునిపై ఉన్న అపారమైన గౌరవంతో హనుమంతుడు ఆ అస్త్రానికి తలవొగ్గి, దానికి కట్టుబడాడు.
దీనినొక అపజయంగా భావించడానికి బదులు రావణుణ్ణి ప్రత్యక్షంగా కలుసుకొనేందుకు ఒక మంచి అవకాశంగా పరిగణిస్తాను. నన్ను బందీగా తీసుకువెళ్తున్నప్పటికీ బ్రహ్మదేవుని వరంవల్ల కొద్దిసేపట్లోనే నన్ను నేను విడిపించుకో గలననటంలో నాకు సంశయం లేదు" అనుకున్నాడు.
కొందరు రాక్షస యోధులు వచ్చి హనుమంతుణ్ణి బలమైన త్రాళ్ళతో బంధించారు. కట్టివేస్తు వారాయనను కఠినోక్తులతో దూషించారు. అయితే బ్రహ్మాస్త్రశక్తిని యితర విధాలైన బంధనాలతో కలిపి వినియోగించలేరు కనుక హనుమంతుణ్ణి త్రాళ్ళతో కట్టటంతోనే బ్రహ్మాస్త్రశక్తి నిష్ఫలమైపోయింది. అయినప్పటికీ హనుమంతుడు రావణుణ్ణి కలుసుకోగలగటానికై బాద చెందుతున్నట్లు అభినయిస్తూ తనను రాక్షసులచేత బందింపనిచ్చాడు.
హనుమంతుడు బ్రహ్మాస్త్ర ప్రభావంనుండి విముక్తుడై కూడా బందితుడైనట్లు నటిస్తున్నాడని ఇంద్రజిత్తు అర్ధం చేసుకోగలిగాడు. “హనుమంతుణ్ణి పట్టుకోవడం ఈ రాక్షసుల అనాలోచిత చర్యవల్ల నిష్ఫలమైయిపోయింది. అంతేగాక బ్రహ్మాస్త్ర ప్రభావం రద్దయిపోవడంతో అదే ప్రత్యర్ధి మీద దానిని మరోసారి ప్రయోగించడం కుదరదు" అనుకున్నాడు.
ఈ సంకట పరిస్థితి గురించి ఇంద్రజిత్తు మధనపడుతుండగా రాక్షసులు ఒకరితో ఒకరు "వానరాన్ని పోలిన ఈ ప్రాణియెవడు? ఇతణ్ణి మనం వెంటనే చంపివేయాలి. చంపేయ్యండి! వేగించుకొని తిందాం!" అంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ హనుమంతుణ్ణి రావణుని సమ్ముఖానికి లాగుకువెళ్లారు. రావణుడితో హనుమ పలికిన పలుకులు రేవు తెలుసుకుందాం....
✨ ధర్మ సూక్ష్మం: ఒక కార్యం మీద వెళ్ళినప్పుడు కేవలం చెప్పిన పని మాత్రమే కాకుండా, దానికి అనుషంగీకంగా ఉపయోగ పడే కార్యం చేయడం నిజమైన కార్యసాధకుడి (ఉత్తమ దూత) లక్షణం. అని వాల్మీకి మహర్షి హనుమంతుని ద్వారా బోధిస్తున్నారు.
మనకు ఎంత శక్తి ఉన్నా దైవ శక్తి నీ, సంప్రదాయాన్ని గౌరవించడం మన విది అని భగవంతుని అస్త్రాలకు (బ్రహ్మాస్త్రం) తలవంచడంలో హనుమ చూపిన వినయం కూడా ఇక్కడ గమనించదగినది.
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Post a Comment