Rama Ravana Yudham Sampoorna Ramayanam Part 39 | సంపూర్ణ రామాయణం
Rama Ravana Yudham Sampoorna Ramayanam Part 39 | సంపూర్ణ రామాయణం
🚩 సంపూర్ణ రామాయణం - 39 వ రోజు 🚩 కథా వివరణ
1. రావణుడి ఆఖరి ప్రయత్నం - వానర వీరుల పతనం
ఇంద్రజిత్తు మరణం తర్వాత రావణుడు రగిలిపోతూ రణరంగంలోకి ప్రవేశించాడు.రావణుని ఆదేశం మేరకు ఒక లక్షమంది రథికులు, మూడులక్షలమంది గజదళయోధులు, ఆరుకోట్లమంది ఆశ్విక సైనికులు, అపరిమిత సంఖ్యలో పదాతి సైనికులు బారులు తీరారు. అంతట రావణుడు ఎనిమిది అశ్వాలు లాగే తన రథాన్ని అధిరోహించి ప్రధాన దేవతలకు చెందిన అసంఖ్యాకమైన అస్త్రాలను సమకూర్చుకున్నాడు. యుద్ధానికి బయలు దేరుతూ ఉంటే రావణునికి ఎన్నో దుశ్శకునాలు కనపడ్డాయి అయిన లెక్క చేయక ముందుకే సాగాడు.
రావణుడి విజృంభణ: రావణుడు తన దివ్యాస్త్రాలతో వానర సైన్యాన్ని కకావికలం చేశాడు. ఆ ధాటికి తట్టుకోలేక వానర వీరులు భయంతో పరుగులు తీశారు.
సుగ్రీవుడి పరాక్రమం: సైన్యం వెనకడుగు వేయడం చూసి సుగ్రీవుడు స్వయంగా రంగంలోకి దిగి, రావణుడి సేనాపతులైన విరూపాక్షుడిని,మహోదరుడిని గదతో సంహరించాడు.
మహాపార్శ్వుడి అంతం: మరో సేనాపతి మహాపార్శ్వుడిపై జాంబవంతుడు, అంగదుడు విజృంభించారు. అంగదుడి ముష్టిఘాతాలకు మహాపార్శ్వుడు నేలకొరిగాడు.
2. రామ-రావణ యుద్ధం & లక్ష్మణ మూర్ఛ
* లోక భయంకర యుద్ధం: రాముడు, రావణుడు ఎదురుపడ్డారు. రావణుడు ప్రయోగించిన ఆసురాస్త్రాన్ని రాముడు తన ఆగ్నేయాస్త్రంతో నిర్వీర్యం చేశాడు.
ఇద్దరి మధ్య ఘోరంగా యుద్ధం సాగింది. పది శక్తివంతమైన బాణాలతో రాముని వక్ష స్థలం చీల్చాడు రావణుడు. రాముడు కూడా బీకరమైన బాణాలు వేసి, రావణ ద్వజాన్ని, సారధిని కూల్చాడు.ఇది బాణాలు రాక్షస రాజు కంఠం లో దింపాడు.
విభీషణుడు కూడా ముందుకు వచ్చి రావణుడి పై బాణములు వేసి రథాన్ని తుత్తూ నియలు చేస్తే కోపం తో రావణుడు శూలాన్ని విభీషణునీ మీదకు వేశాడు దాన్ని లక్ష్మను డు గాల్లోని నిర్వీర్యం చేశాడు.
శక్తి ఆయుధ ప్రయోగం: లక్ష్మణుడు రావణుడిని ఎదిరించి లెక్కకు మిక్కిలి బాణాలు వేసాడు, దాంతో రావణుడు మాంత్రిక శక్తులతో అజేయమైన 'శక్తి' అనే బల్లెమును ప్రయోగించాడు. అది తగలగానే లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేలకొరిగాడు.
రాముడి విజృంభణ: తమ్ముడి స్థితిని చూసి రాముడు అత్యంత క్రోధంతో రావణుడిపై బాణవర్షం కురిపించగా, రావణుడు భయపడి రణరంగం నుండి పారిపోయాడు.
3. హనుమంతుడి సంజీవని పయనం & లక్ష్మణుడి పునర్జీవం
సంజీవని పర్వతం: లక్ష్మణుడిని చూసి రాముడు విలపిస్తుండగా, సుషేణుడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు వాయువేగంతో హిమాలయాలకు వెళ్లి, సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు.
సుషేణుడి చికిత్స: వానర వైద్యుడు సుషేణుడు ఆ దివ్యౌషధులతో చికిత్స చేయగా, లక్ష్మణుడు తక్షణమే కోలుకున్నాడు. మేల్కొన్న లక్ష్మణుడు రాముడికి తన ప్రతిజ్ఞను గుర్తుచేస్తూ, రావణ సంహారానికి ఉత్సాహపరిచాడు. ఈలోగా రావణుడు వేరొక రథం అధి రోహించి యుద్ధానికి వచ్చాడు.రాముడు తన ధనుస్సును చేబూని రావణుని మీద కుంభవర్షంలా బాణాలను కుమ్మరించాడు. అయితే ఆకాశంలో నిలిచి ఉన్న దేవతలు “ఈ యుద్ధం న్యాయబద్ధంగా పోరాడబడటం లేదు. రావణుడు రథాన్ని అధిరోహించి తిరుగుతుండగా రాముడు నేలమీదనే నిలిచి ఉన్నాడు!" అంటూ ఆవేదన వెలిబుచ్చారు
4. దేవరాజ ప్రసాదం & ఆదిత్య హృదయం
* మాతలి - దివ్య రథం: రాముడికి సాయంగా ఇంద్రుడు తన సారథి మాతలిని, తన దివ్య రథాన్ని పంపాడు. రాముడు ఆ రథంపై ఉండి రావణుడి రాక్షసాస్త్రాలను తన గారుడాస్త్రంతో అడ్డుకున్నాడు.
రావణుడి భంగపాటు: రాముడి బాణాలకు తట్టుకోలేక రావణుడు సోలిపోవడంతో, అతని సారథి సమయస్ఫూర్తితో రథాన్ని పక్కకు మళ్లించాడు. దీనికి రావణుడు మండిపడగా, సారథి అతడిని శాంతింపజేసి తిరిగి రాముడి ముందుకు రథాన్ని తెచ్చాడు.
ఆదిత్య హృదయం: యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో సరిగ్గా ఇదే సమయంలో అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ఆదిత్య హృదయము ఉపదేశించారు. రాముడు 3 మార్లు ఆచమనం చేసి దాన్ని జపించి సంపూర్ణ శక్తితో యుద్ధానికి సిద్ధమయ్యాడు.
యుద్దానికి తిరిగి వస్తున్న రావణుడికి తీవ్రమైన దుశ్శకునాలు కనపడ్డాయి, రథం మీద మేఘాలు రక్తం కురిపించాయి, అతని వెనుక రాబందుల గుంపు వచ్చింది, అతి పెద్ద ఉల్క ఒకటి అతని సమీపంలో నే పడి వాడు అతి త్వరలోనే మరణిస్తాడు అని సూచించింది.
అదే సమయంలో రామునికి ఎన్నో శుభ శకునాలు కనిపించాయి.అవి రాముడి విజయాన్ని సూచించాయి.
5. రావణ సంహారం - ధర్మ విజయం
* అద్భుత యుద్ధం: ఇద్దరి మధ్య పోరు మళ్ళీ మొదలైంది ఆ యుద్ధం చూసి లోకాలు నివ్వెరపోయాయి. ఒకరి పై ఒకరు వేల కొలది బాణాలు వేస్తూనే ఉన్నారు.అది చూసి మిగతా సైనికులు ఆశ్చర్యం తో యుద్ధం చేయడమే మర్చిపోయారు. అంత అద్భుతమైన యుద్ధం జరిగింది.రాముడు రావణుడి తలలను నరుకుతుంటే, అవి మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉన్నాయి.
బ్రహ్మాస్త్ర ప్రయోగం: చివరకు రాముడు అగస్త్యుడు ఇచ్చిన ధనస్సుతో, మంత్ర ప్రయోగం చేసి బ్రహ్మదేవుడి అస్త్రం (బ్రహ్మాస్త్రం) సంధించాడు అది రావణుడి వక్షస్థలాన్ని చీల్చి తిరిగి మళ్ళీ రాముని అక్షయ తునీరం లో చేరింది.
రావణుడు చేతిలో ధనుస్సు విడిచి పది నోళ్ళ నుండి రక్తం కక్కుతూ నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. రావణుని అనుచరులు హహ కారాలు చేశారు..
దేవతలు, వానరులు జయజయధ్వానాలు చేశారు. రాముని విజయాన్ని ఎలుగెత్తి చాటుతూ రాక్షసులను తరిమి కొట్టారు.ఆకాశం నుండి దేవతలు "భలారే! అత్యద్భుతం!" అంటూ నినదిస్తూ రాముని రథాన్ని పుష్పవృష్టితో కప్పివేసి దివ్యదుందుభులు మ్రోగించారు. రావణుడు మరణించటంతో ఋషులు దేవతలు అంతవరకు చాలాకాలంగా తాము అనుభవించలేకపోయిన ధన్యమైన నిశ్చింతను, మనశ్శాంతిని పొందారు.
6. యుద్ధానంతర ఘట్టాలు
విభీషణుడి విలాపం: సోదరుడి మృతికి విభీషణుడు శోకించగా, రాముడు అతడిని ఓదార్చి, "మరణంతో పగ ముగిసింది" అని రావణుడికి అంత్యక్రియలు చేయమని ఆదేశించాడు.
మండోదరి విలాపం: మండోదరి సహా అంతఃపుర స్త్రీలు వచ్చి రావణుడి శవంపై పడి విలపించారు. నీ పాప బుద్ధియే నిన్ను రాక్షస వంశాన్నీ అంతం చేసింది రావణ అని మండోదరి విలపించింది.అనంతరం విభీషణుడు రావణుడికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు నిర్వహించాడు.
పట్టాభిషేకం: రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు లంకా రాజ్యానికి విభీషణుడిని రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు.
రాముడు హనుమంతుడిని పిలిచి, "హనుమా! అశోకవనానికి వెళ్లి సీతమ్మకు నా విజయ వార్తను వివరించి, ఆమె క్షేమాన్ని తెలుసుకుని రా" అని పంపాడు. హనుమంతుడు అశోకవనానికి వెళ్లి సీతమ్మకు ప్రణామం చేసి, రావణ వధను వివరించాడు. ఆ వార్త విన్న సీతమ్మ ఆనందంతో మాటలు రాక నిశ్శబ్దంగా ఉండిపోయింది. హనుమా నీవు చేసిన సహాయానికి ఏ బహుమతి ఇచ్చినా తక్కువ అని పలికింది.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
రాముడి ఆజ్ఞ మేరకు విభీషణుడు సీతమ్మను పవిత్ర స్నానం చేయించి, దివ్యాభరణాలతో అలంకరించి పల్లకిలో తీసుకువచ్చాడు.(ఇన్ని నెలలు అక్కడి నీరు కూడా ముట్టని తల్లి ఇప్పడు అక్కడ ధర్మం ఉంది, రాణిని ఆజ్ఞ కనుక తల్లి స్వీకరించింది)
వానరుల కుతూహలం: సీతమ్మను చూడాలని వానర సైన్యం ఎగబడగా, విభీషణుడు వారిని వారించాడు.
రాముడి ఆదేశం: అప్పుడు రాముడు విభీషణుడితో.. "స్త్రీకి శీలం, ప్రవర్తనే నిజమైన రక్షణ. పల్లకీలు, గోడలు కాదు. నా వానర సైన్యం అంతా తమ తల్లిని (సీతమ్మను) కళ్లారా చూడనివ్వు. ఆమె పల్లకి దిగి నడచి రావాలి" అని ఆదేశించాడు. సీతమ్మ తల వంచుకుని రాముడి వైపు నడచి వచ్చింది.
రాముడి పరుష మాటలు - లోకాపవాదు భయం :
సీతమ్మ దగ్గరకు రాగానే, రాముడు అందరి ముందు ఆమెతో కఠినంగా మాట్లాడాడు. "నేను నా వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి, రావణుడిని శిక్షించడానికి మాత్రమే ఈ యుద్ధం చేశాను. నీవు నీ ఇచ్ఛ ఉన్న చోట ఉండవచ్చు అని పలికాడు
రాముడి మాటలకు కుంగిపోయిన సీతమ్మ, కన్నీళ్లతో లక్ష్మణుడిని చితిని సిద్ధం చేయమని కోరింది.
శపథం: "నేను మనసా, వాచా, కర్మణా రాముడిని తప్ప మరొకరిని తలవకపోతే, ఈ అగ్ని నన్ను రక్షించుగాక" అని ప్రార్థించి ధైర్యంగా అగ్నిలో దూకింది.
దివ్య రూపం: కొద్దిసేపటికే అగ్నిదేవుడు సీతమ్మను తన చేతులతో పట్టుకుని, ఆమెకు ఎటువంటి హాని కలగకుండా అగ్ని నుండి బయటకు తీసుకువచ్చాడు. "రామా! నీ భార్య అత్యంత పవిత్రురాలు, ఆమెలో ఎటువంటి దోషం లేదు" అని సాక్ష్యం చెప్పాడు.
Rama Ravana Yudham Sampoorna Ramayanam Part 39 | సంపూర్ణ రామాయణం
అప్పుడు రాముడు కన్నుల నుండి అశ్రువులు కారుతూ ఉండగా.. "అగ్నిదేవా! సీత పవిత్రురాలని నాకు తెలుసు. నేను వేరు సీత వేరు కాదు.కానీ లోకానికి ఆమె పాతివ్రత్య మహిమ తెలియాలి, అందుకే ఈ పరీక్ష పెట్టాను. సముద్రుడు తన గట్టును దాటలేనట్లు, సీత నన్ను తప్ప మరొకరిని తలవదు" అని సీతమ్మను హృదయపూర్వకగా స్వీకరించాడు
నిజం: రాముడికి సీతమ్మ పవిత్రత తెలుసు, కానీ భవిష్యత్తులో ఏ సామాన్యుడూ తనను వేలెత్తి చూపకూడదని (లోకాపవాదు), ధర్మం కోసం అత్యంత బాధతో ఆమెను పరీక్షకు గురిచేశాడు. (ఎందుకంటే అతడు మహారాజు కాబోతున్నాడు కనుక, ఎంతో వేదన పడ్డాడు రాముడు కానీ అన్ని పరీక్షలు పెట్టినా అపవాదు వచ్చింది కదా ఆ మాత్రం పరీక్ష పెట్టకపోతే ఇక లోకం ఏమనేది చెప్పండి)
ఈ ఘట్టంతో సీతారాములు తిరిగి ఏకమయ్యారు. అరణ్యవాస దీక్ష ముగిసి, మంగళప్రదమైన పట్టాభిషేకానికి మార్గం సుగమమైంది.
✨ ముగింపు: ఈ విధంగా అధర్మం అంతమై, లంకలో ధర్మపాలన ప్రారంభమైంది. రాముడి కీర్తి దశదిశలా వ్యాపించింది. సీతారాములు ఏకం అయ్యారు రామ రాజ్యం ప్రతిష్టితం కాబోతుంది. ఎంత అదృష్టం అండి రామ నవమి రోజు సీతా రామ కళ్యాణం మధ్యాహం చూడండి సాయంత్రం పట్టాభిషేకం చేసుకుని హృదయ సీమలో రామున్ని ప్రతిష్ట చేసుకుని జన్మ తరింప చేసుకుందాం.
ఈ 40 రోజుల పాటు చదివిన వారి అదృష్టమే అదృష్టం అండి ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ దక్కని భాగ్యం ఇది, నారదుడు చెప్పాడు స్కంద పురాణం లో రామాయణ మహత్యం లో , ఎవరి పూర్వ జన్మ పాపాలు అన్ని భస్మం అయిపోయే స్థితిలో ఉంటాయో వాడు మాత్రమే మాఘ, చైత్ర మాసాల్లో రామాయణం వినడం లేదా చదవడం చేస్తాడు, పాపాలు ఎక్కువగా ఉన్నవాడు ఈ కథ ప్రారంభం కాగానే అక్కడి నుండి వెళ్ళి పోతాడు వినలేడు అని..
జయ శ్రీరామ 🙏🙏🙏🙏
శ్రీరామ జయమ్!
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
బలం విష్ణోః ప్రవర్ధతాం
...సశేషం
Post a Comment