రాజు మూర్ఖత్వం - Raju stupid Telugu Lo Stories Kathalu | పోలీసు గుర్రం
మూసీ నది ఒడ్డునున్న దట్టమైన తాటి వనంలో తొమ్మిది మంది సభ్యులున్న గెరిల్లా దళం విశ్రాంతి తీసుకుంటోంది. దళ కమాండర్ హరినారాయణ బ్రాహ్మడు. నిజాం మీద జరుగుతున్న పోరాటానికి ఆకర్షితుడై మిల్ట్రీ నుంచి వచ్చి, దళ సభ్యులకు గెరిల్లా శిక్షణ ఇస్తున్నాడు. చాకలోళ్ల సాయన్న, తురకోళ్ల హుసేను, ఒడ్డెరోళ్ల పిచ్చయ్య, కంసలోళ్ల రామబ్రహ్మం, కోంటోళ్ల శేషయ్య, అనిరెడ్డి చంద్రారెడ్డి, మాలోళ్ల మోష, వివిధ కులాల వాళ్లు, మతాల వాళ్లు ఉన్నారు.
వారినందరినీ ఒకటి చేసి దండు కట్టించింది కమ్యూనిస్టు పార్టీ డిప్యూటి దళ కమాండర్ తెలగోళ్ల వెంకటాద్రి సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు.
వెన్నెల సన్నగా కాస్తోంది. బలుసు పొదలు, మంగ పొదలు, జిట్ట రేగు పొదల నుండి వచ్చే సన్నటి పరిమళం ఆ ప్రాంతాన్నంతా సుగంధభరితం చేస్తోంది. కానీ ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేడు వెంకటాద్రి. రజాకార్ల అకృత్యాలకు అతని గుండె భగభగ మండిపోతోంది. ఒకటా, రెండా? ఎన్నని ....? ఐనా, ప్రజల అండతో రజాకార్లను ముప్పు తిప్పలు పెట్టి, పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఉరుములేని పిడుగులా కొత్తగా వచ్చి పడ్డది ఆశ్విక దళం. గుర్రాలు ఎనుబోతంత ఉన్నాయి. గుల్బర్గా నుంచి వచ్చాయట. హైద్రాబాదులో వీటికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద శాలలే ఉన్నాయట. నైజాం నవాబు కమ్యూనిస్టుల్ని అణిచి వేయడానికి ప్రత్యేకంగా పంపాడు.
కమ్యూనిస్టు కనబడితే వదిలి పెట్టడం లేదు. ఎంత జనంలో ఉన్నా ఇట్టే గుర్తు పట్టి వెంటబడుతున్నాయి. ఇప్పటికే ఆశ్విక దాడిలో పసు నూరు వెంక టరెడ్డి
చనిపోయారు. కాలేజీ చదు వుల్ని వదిలేసి పోరాటంలోకి వచ్చినవాడు. వెన్నెలంత చల్లనోడు. గ్రామంలో ఉండగా సిఐడిల సమాచారంతో హఠాత్తుగా దాడిచేసి చంపింది. హరినారాయణ దళం గ్రామంలోకి పగలే వెళ్లింది. ప్రజలంతా ఆత్మ బంధువును చూసి మూగినట్టు చుట్టూ చేరారు.
''మీరు లెవీ కట్టకండి. ఈ నిజామోడి తాబేదార్లయిన జమీందార్లని, పట్వారీలని ఊళ్ళె నుంచి వెళ్లగొట్టాలె. మన గ్రామంలో మన పరిపాలనే ఉండాలె. దున్నే వాడికే భూమి దక్కాలె. అందరికీ భూమి కోసమే ఈ పోరాటం. భూముంటే బువ్వుంటుంది. బట్టుంటది. మనం మంచిగ బతుకుతాం... ముఖ్యంగా శత్రువుకు మన సమాచారం ఇచ్చే వాళ్లని కనిపెట్టి ఉండండి.'' దళ కమాండర్ ప్రజలకు వివరిస్తున్నాడు.
ఇంతలో ఉరుము లేని పిడుగులా వచ్చి పడ్డాయి.. పన్నెండు గుర్రాలు. ఊళ్లో నుంచి మోత్కూరుకు పోవడానికి తూర్పు వైపు నుంచే వెళుతుంటారు సామాన్యంగా. అటు నుంచే పోలీసు రావచ్చని సెంట్రీని పెట్టారు. దాన్ని అంచనా వేసి, గ్రామాల మీదుగా దాటి, పడమర వైపు నుంచి వచ్చారు. వంద గజాల దూరంలో గుర్రాలు కనబడే సరికి ''గ్రామాల మీదుగా దాడి, పారిపోండి.'' మొదట చూసిన వ్యక్తి గట్టిగా అరిచాడు. గద్ద కనబడితే కోడి పిల్లలు కకావికలం అయినట్లు జనమంతా తలో దిక్కు పరిగెత్తారు. ఆ సమయంలో పొజిషన్ తీసుకోవడం కూడా సరైనది కాదని దళం కూడా పరిగెత్తింది. రజాకార్లు జనాన్ని బెత్తంతో బాదుతూ, తుపాకి మడమతో గుద్దుతూ వెంటబడ్డారు.
బలం కొద్దీ జనంలో పడి పరిగెత్తుతున్నారు. సంకనున్న తుపాకిని చూసి, చోటేమియా గాని గుర్రం వెంకటాద్రి వెంటబడ్డది. దాని గురించి జనం కతలు కతలుగా చెప్పుకోసాగారు. అది మేలు జాతిదని, చోటేమియా రిజ్వీనడిగి ప్రత్యేకంగా తెచ్చుకున్నాడని, అది వెంటబడితే యమినోడు వెంటబడ్డట్లేనని, అది కాళ్లతోటే మనిషిని తొక్కి చంపుద్దని.. జనంలో ప్రచారం జరిగింది. అది రజాకార్లకు అవసరం కూడ. ఆశ్విక దళం గురించి నాయకులు చెప్పింది గెరిల్లాకు జ్ఞాపకముంది. గుర్రాలంటే భయపడొద్దు. అట్లాగని తక్కువ అంచనా వేయొద్దు. వాడి దగ్గర తుపాకి ఉంటది. దూరం నుంచి కాలు స్తాడు. గుర్రం పరిగెత్తు తుంటది కాబట్టి, గురికుదర కపోవచ్చు. కానీ దగ్గరలో వుంటే తల్వార్ విసురుతాడు. అది మరీ ప్రమాదం కత్తికి అందనంత దూర ంలో పరిగెత్తాలి.
బారుగా ఎక్కువ దూరం పరిగెత్తొద్దు. ఎందుకంటె గుర్రంతో సమానంగా మనిషి పరుగెత్తాలి. వంకర టింకరగా ఉరకాలె.. అక్షరాలా సూచనలు పాటిస్తూ ఉరుకుతున్నాడు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడ్డది. వేగంగా మోదుగు పొదలు దాటి పరిగెత్తుతున్నాడు. గుర్రం ఊపిరి వెంకటాద్రి మెడ మీద వెచ్చగా తగులుతోంది. గభాల్ని కిందకు వంగి, పక్కకు పరిగెత్తాడు. అదే వడి మీద గుర్రం ఇరవై గజాలు ముందుకు పరిగెత్తింది.
గుర్రాన్ని మలుపుకుని వచ్చే సరికి, తుపాకిని గుబురుగా ఉన్న మోదుగు పొదలో వదిలేశాడు. చాటు నుంచి బావిలోకి దిగి, మోట దార్ల కింద పెరిగిన రాగి చెట్టు చాటున నక్కాడు. రజాకారు పొదల్ని తుపాకితో కెలుకుతూ దిగి, డేగ కళ్లతో చూడసాగాడు. కానీ గెరిల్లా కనబడలేదు. బావికి అడ్డంగా వెళ్లడానికి వీల్లేకుండా ముళ్లకంపలున్నాయి. ఇక కనిపించడని ఆశ వదులుకుని గుర్రాన్ని వెనక్కు మలిచాడు.
వెంకటాద్రి మెల్లగా వెలుపలకు వచ్చి, గుబురుగా వున్న మర్రి చెట్టెక్కి, దాని తొర్రలో కూర్చుని చూడసాగాడు. రజాకార్లు జనాన్ని పశువుల్ని మందగా జేసినట్లు, బెత్తంతో బాదుతూ ఒక్క చోటికి గుంపు చేస్తున్నారు. జనంలో బడి పరిగెత్తి , కనబడకుండా ఉండేందుకు జొన్న చొప్ప వామి కింద దూరాడు.. పాపిరెడ్డి. ఆ దృశ్యం గుర్రం కంట్లో పడ్డది. అది నేరుగా వామి దగ్గరకు పరిగెత్తి గట్టిగా సకిలించింది. గుర్రం భాష తెలిసిన చోటేమియా, తుపాకి చేతిలోకి తీసుకుని కిందకు దూకాడు. చొప్పకు చెదలు ఎక్కకుండా మూరెడు ఎత్తున రాళ్లతో నెట్టు కట్టి ఉంది. దళంలో పనిచేసే పాపిరెడ్డి, తల్లిని చూసి పోదామని వచ్చా డు. సిఐడి సమాచారంతో వచ్చిపడ్డారు రజాకార్లు.
తుపాకి తీసి ఊపుతూ ''బాహర్ ఆవో సాలే. నైతో గోలీ మార్ దూంగా.'' బెదిరించాడు తుపాకితో. తప్పదని పాపిరెడ్డి పాక్కుంటూ మెల్లగా వెలుపలకు వచ్చాడు. కమ్యూనిస్టులకు అన్నం పెడుతున్నారని, ఊళ్లోకి వస్తే కలిసి తిరుగుతున్నారని ఐదుగురిని వేరు చేశారు. వాళ్ల కాళ్లు, చేతులు తాళ్లతో గట్టిగా కట్టేశారు. పాపిరెడ్డి కమ్యూనిస్టు గెరిల్లా అని తెలవగానే, తుపాకి మడమతో వీపున ఒక్క గుద్దు గుద్దాడు చోటేమియా. కింద పడ్డవాడ్ని, బూటు కాలుతో తొక్కిపట్టి, రెక్కలు వెనక్కు విరిచి కట్డాడు. కాళ్లు కదలకుండా కట్టాడు. మరో పోలీసు రాగానే ఇద్దరు చెరో వైపు పట్టి అమాంతం చొప్ప వామి మీదకు విసిరేశారు. అప్పటికే బందీలుగా వున్న ఐదుగుర్ని కూడా దాని మీదకు విసిరేశారు. తల్లీ పిల్లలు, జనం గుండెలు బాదుకుంటున్నా, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.
చొప్ప వామికి నిప్పంటించి, చచ్చారనుకున్న తర్వాత కొంత మంది యువకుల్ని కొట్టుకుంటూ స్టేషన్ వైపు నడిపించారు. సహచరులు సజీవ దహనం అవుతుంటే ఏమీ చేయలేక చెట్టు మీదే పొగిలి పొగిలి ఏడ్చాడు వెంకటాద్రి. తనీ రోజు గుర్రానికి దొరికి వుంటే.....? ఆ పైన ఆలోచించలేకపోయాడు. ఎలాగైనా ఆ గుర్రం అంతు చూడాలి. సిఐడిల సంగతి తేల్చాలి.
మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఆ అవకాశం దళ కమాండర్ ప్రయాణ రూపంలో రానే వచ్చింది. ''బిడ్డకు సంబంధం వచ్చిందంట. వెళ్లి వెంటనే వస్తా. దళం బాధ్యత నీదే...'' అని రివాల్వర్ చేతిలో పెట్టి, ఆయుధం జాగ్రత్త అని ఆ రాత్రే ఇంటికి బయలు దేరాడు.
దళం బాధ్యతలు తీసుకోగానే, తర్వాతి సీనియర్ అయిన శేషయ్యకు బాధ్యతలు అప్పజెప్పి బయలు దేరాడు. చావిట్లో నిలబడే నిద్రపోతున్నాయి గుర్రాలు. పగలల్లా జనాన్ని హింసించిన
పోలీసులు, గొల్లోళ్ల దగ్గర ఎత్తుకొచ్చిన రెండు యాటల్ని కోసుకు తిని, గౌండ్లోళ్ల దగ్గర కల్లుబిర్రుగ దాగి గురకలు బెట్టి నిద్రపోతున్నారు. పదహారు గుర్రాలు వరుసగా కట్టేసి వున్నాయి. పోలీసుల్లాగే బలిసి దృఢంగా వున్నాయి. చివరన వుంది...
చోటేమియా ముద్దుగా పిలుచుకునే కాలాషేర్. దాని తోక చీకట్లో తెల్లగా మెరుస్తోంది. వెళితే కొత్త మనిషిని చూసి అలికిడి చేస్తాయి. ఒక్క క్షణం ఆలోచించి, పక్కనే ఉన్న గుడిసెలో నిద్రపోతున్న నపరోడి దగ్గరకు వెళ్లాడు. గుర్రాల్ని కడగడం, మాలిషు చేయడం, వాటికి దాణా పెట్టడం వాడి పని. మెల్లగా లేపాడు. కళ్లు తెరిచి చూసిన తిరపయ్యకు మృత్యువు ముందల నిలబడ్డట్ల నిపించింది. గడగడా వణుకుతూ ''పోలీసులు ఠాణాల ఉన్నారు. నన్ను సంపకండి, నేను మీ జోలికి రాలే.'' అని చేతులు జోడించాడు.
''నిన్ను చంపను కానీ, నాకు చోటేమియా గాడెక్కే ఆ తెల్లతోక నల్ల గుర్రాన్ని తెచ్చిపెట్టు'' అన్నాడు.
''తెలిస్తే నన్ను సంపుతరయ్యా...'' అన్నాడు భయపడుతూనే.
''అందరం సచ్చెటోల్లమే. మంది కోసమే మేము హత్యార్ బట్టింది. మేము జనం కోసం జస్తుంటే, మీరు రజాకార్లకు రజాయి కప్పుతారా? తేకుంటే నా చేతిలో ఆయుధముంది చూసినవు గద?'' అన్నాడు బెదిరింపుగా.
''పట్టకొస్తనయ్యా. తెంపుకు పోయిందని చెప్తాలే. జీతం లేదు, నాతం లేదు.
కొడుకులు సంపక తింటున్నారు. కాళ్లు పట్టాలె. ఒళ్లునొక్కాలె. తిన్నయన్ని సాపు జెయ్యాలె. సస్తున్న సాకిరి జెయ్యలేక. ఒక్కోడి కాడ కంపు వాసన.'' అని గొణుక్కుంటూ లేచాడు..
యాభయ్యేళ్లున్న తిరుపయ్య. వెంకటాద్రి చావడి వెలుపలకు వచ్చి మసక చీకట్లో దూరంగా నిలబడ్డాడు. గుర్రం తాడు విప్పి, గోడకు తగిలించిన జీను గుర్రం మీద సర్ది, కళ్లాన్ని తెచ్చి చేతికిచ్చాడు.వెనక్కు ముందుకు ఒకసారి చూచి, అమాంతం గుర్రం ఎక్కాడు. తన యజమాని కాకపోవడంతో ముందుకు కదలకుండా మొరాయించింది. నాలుగేళ్ల కింద కిషన్ రావు దొరకాడ షేర్‌దారుగా పనిచేసినప్పుడు వాళ్ల గుర్రాల మీద సవారి చేసిన అనుభవముంది. వెంటనే దాని డొక్కలో కాలి మడమతో ఒక్క తన్ను తన్నాడు. దాంతో ముందుకు దూకింది.
గుర్రాన్ని సవారీ చేస్తూ నేరుగా వెల్మజాల షావుకారు మల్లయ్య ఇంటి ముందుకు తీసుకుపోయి నిలిపాడు. జిలుగు జిలుగు వెన్నెల రాలుతోంది. మనిషి పూర్తిగా కనబడకుండా వేపచెట్టు నీడలో వున్నాడు. గుర్రం తల మాత్రం వెలుతురులో కనబడుతుంది. అరుగు మీద నిద్రపోతున్న జీతగాడ్ని లేపాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్లి మల్లయ్యను లేపాడు. పోలీసు వచ్చాడని ఊడే పంచను సర్దుకుంటూ ఈ వేళప్పుడు వచ్చింరేంది బాంచెన్... అని అడిగాడు వినయంగా.
''కమ్యూనిష్టు ...కొడుకులు రేత్తిరే గదరా తిరిగేది. వాళ్లను పట్టుకోవాలంటే రేత్తిరే రావాలె. ఊళ్లకు ఇయ్యాల ఎవరన్నా వచ్చిండ్రా?''. ముఖం కనబడకుండా మీద వేసుకున్న గొంగడి చాటు నుంచి ''రాలేదు బాంచన్. వస్తే కబురు చేస్త గదా. పాపిరెడ్డి వచ్చింది, దళం వచ్చేది ముందే చెప్పినగా బాంచెన్.'' వినయంగా వంగి సమాధానం చెప్పాడు.
''నువ్వు ఒక్కడివి జాస్తవు? మిగతా వాళ్లు సరిగ్గా సిఐడి చేస్తున్నారా?''
''చేస్తున్నారు బాంచెన్. పూసల రంగయ్య, తురకోళ్ల మోదిన్, వడ్డెర సాయిలు మంచిగ పని జేస్తున్నారు. ఆ కమ్యూనిస్టు కొడుకులు నా వడ్డీ కాగితాలు తగలబెట్టింరు బాంచెన్. భీమిరెడ్డి గాడ్ని ముందు సంపాలె. వాడ్ని జూసి జనం తెగ రెచ్చిపోతుంరు బాంచెన్''.
''సంపడానికే గదరా మేం తిరిగేది. అట్టనే మందిల ఉండి ఎంక్వైరీలు దీయండి. మీకు రిజ్వీ తోటి పెద్ద ఇనాం ఇప్పిస్తా. కొడుకులు వచ్చేది ఎప్పటికప్పుడు జెప్పాలి. వాళ్లని సావనూకాలె.''
''అట్లాగే బాంచెన్...'' సంతోషంతో అని, వినయంగా వంగి అలాగే ఉన్నాడు.
గుర్రాన్ని వెనక్కు తిప్పాడు. మనసులోనే వాళ్ల పేర్లు నమోదు చేసుకుని కాస్త దూరం వెళ్లగానే జేబులో వున్న చిన్న పుస్తకంలో రాసుకున్నాడు. అదే రాత్రి గుర్రం మీద రేపాక, ఎర్రబెల్లి వెళ్లి, అంతకు ముందు ప్రజలు అందించిన సమాచారం ప్రకారం సిఐడిలను కలిశాడు. కమ్యూనిస్టుల్ని తిట్టుకుంటూ, నల్లగుర్రం మీద నుంచే సమాచారం సేకరించాడు. అందరి పేర్లు పుస్తకంలో రాసుకుని తెల్లవారే సరికి దళాన్ని చేరుకున్నాడు.
''అరే ఇది చోటేమియా గాడి గుర్రం గదన్నా. కళ్లెం వదులు దీన్ని చంపేస్తా. చాల మందిర్ని సంపిందన్నా.'' ఇస్తారి గన్నుతీశాడు, పళ్లు నూరుతూ.
''ఇంకొంత పనుంది దీనితోటి. పనైనాక ఇస్తాలే.'' అని జరిగిన సంగతంతా చెప్పి, మూడు ఊళ్లల్ల పోలీసులకు సమాచారం అందించే వాళ్ల పేర్లు చదివాడు.
''అమ్మా ఈ ... కొడుకులు మనం బోంగనే, జై గొట్టుకుంట మనెంబటే తిరుగుతరన్నా. వట్టి ఎల్లాబి... కొడుకులు. వాడి డబ్బుకు ఆశపడి సిఐడి జేస్తున్నారు. కొడుకుల్ని బతకనీయెద్దు.'' బ్రహ్మం ఆవేశంగా అన్నాడు.
''వీళ్లు చోటేమియా గాడ్ని కలిసే లోపే పట్టుకోవాలె. వాడి గుర్రాన్ని గెరిల్లాలు దొబ్బుకుబోయింరని చెబితే భయపడి తప్పించుకుపోతారు.'' అన్నాడు హుసేను.
''అన్న జెప్పింది నిజమే. మనకో మంచి వార్త. ఆ చోటేమియా గాడు నాలుగు రోజులు హైద్రాబాదు పోతున్నడంట రజ్వీని కలవడానికి. రోజుకో ఊరుబొయ్యి కొడుకుల సంగతి చూద్దాం.'' అన్నాడు.
''లేదు, లేదు. ఒకే రోజు మూడు ఊళ్లల్లో సిఐడిలను పట్టుకోవాలె. ఒక ఊళ్లె పట్టుకున్నమని వార్త తెలవంగనే, తప్పించుకపోతారు. కాబట్టి ముగ్గురు చొప్పున ఒక్కో ఊరు వాళ్లను పట్టుకుందాం. నేను వెల్మజాల వెళతాను ఎందుకంటే జనం భయం మీదున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పాలె.'' అన్నాడు.
మిగతా ఇద్దర్ని వెంటబెట్టుకుని వెల్మజాల వెళ్లాడు. చోటేమియా గాడి గుర్రాన్ని జూసిన జనం పారిపోసాగారు. జేబులోంచి ఎర్ర జెండా తీసి గాలిలో ఊపాడు. అది పీడితులకు రక్షణ నిచ్చే గొడుగని, అణచివేయబడే జనానికి వేగు చుక్కని తెలుసు. అందుకే, వాన పడితే ఉసిళ్లు బైటికొచ్చినట్లు, ఊరంతా వాళ్ల దగ్గరికి వచ్చి చేరింది. చోటేమియా గాడ్ని, వాడి గుర్రాన్ని తిట్టసాగారు. ''ఎట్ల దెచ్చినవు ...గాడి గుర్రాన్ని?'' అని గుచ్చి గుచ్చి అడగసాగారు.
''గా ముచ్చట తర్వాత చెబుతగాని, కోంటోళ్ల మల్లయ్యను, పూసల రంగయ్యను, తురకోళ్ల మోదిన్‌ను, వడ్డెర సాయిగాడ్ని గుంజక రాపోండి. కొడుకులు సిఐడి జేస్తుంరు.'' అన్నాడు.. వెంకటాద్రి. ''కొడుకులు అంత పని జేస్తున్నారా? బతకనీయోద్దు. సక్కదనాల పాపిరెడ్డిని, రాంరెడ్డిని పొట్టన బెట్టుకున్నరా.'' అంటూ పరిగెత్తుకు వెళ్లి ఇండ్ల మీద పడ్డారు.
తలకు వున్న కండువాను శత్రువు మెళ్లో వేసి, కచ్చేరి వద్దకు లాక్కొచ్చారు. కాస్త చదువుకున్న మల్లయ్య వచ్చినోళ్లని మాటల్తో అదరగొట్టాడు. కానీ చోటేమియా గాడి గుర్రాన్ని దళం దగ్గర చూసే సరికి నక్కిళ్లు పడ్డాయి.
తప్పయిందని కాళ్లా, వేళ్లా పడ్డాడు. అప్పుడు దళ కమాండర్ రాత్రి జరిగిన సంగతంతా జనానికి వివరించాడు.
''ఈ దుర్మార్గుల్ని అస్సలు వదలొద్దన్నా. వీళ్లను క్షమిస్తే పామును వదిలి పెట్టినట్లే. మళ్లీ సిఐడి జేసి జనాన్ని సంపిస్తరు.'' జనం కేకలు వేయసాగారు.
''సోచాయించకండి బిడ్డలారా. నా కొడుకు చూసిపోదామని వస్తే, ఆ రజాకారు నా బట్టకు జెప్పి, సంపించిండ్రు. నా కొడుకు నిలువున మంటల్లో కాలిపోయిండు.'' గుండెలు బాదుకుంటూ ఏడ్వసాగింది తల్లి. తర్వాత తేరుకుని మీకు పాపమనిపిస్తే, ఆ అత్యారిటియ్యండ్రి. నిలువున గాలుస్త. ఆటెంక అమీనోడొచ్చి సంపినా సస్త.'' డెబ్బయ్యేళ్ల ఆదెమ్మ శిగం వచ్చిన దానిలా ఊగిపోతోంది.
గెరిల్లా తుపాకి ఎక్కు పెట్డాడు. సిఐడిలు జనం నుంచి దూరమైపోయారు.
ఎర్రబెల్లి రాపాకల్లో గూడా ప్రజలు, సిఐడిలు చేసే వాళ్ల పేరు చెప్పగానే పట్టి లాక్కొచ్చారు. కమ్యూనిస్టులొచ్చారని తెలిసి, గడ్డివాముల్లో, గాదెల్లో, మసెల మీద దాక్కున్న ద్రోహుల్ని గాలించి మరీ గుంజుకొచ్చి బజాట్లో కూలేశారు. జరిగనదంతా జనానికి వివరించి నిర్ణయం ప్రజలకు వదిలేశారు.
జనం చంపాల్సిందేనని తీర్పిచ్చారు. తీర్పును అమలు చేశారు.. గెరిల్లాలు.
ఒకే రోజు మూడు గ్రామాల్లో కమ్యూనిస్టు ద్రోహుల్ని ఏరేసి స్థావరానికి చేరుకున్నారు. దళ కమాండర్ ముందు కూర్చుని వున్నారు.. దళ సభ్యులు.
''గెరిల్లాకు తుపాకి ఎలాగో, గుర్రం కూడా అట్లాంటిదే. అది ఎవడి చేతిలో ఉంటే వాడికి ఉపయోగపడుద్ది. అదే ఒక్కోసారి మన ఉనికిని శత్రువుకు కూడా తెలియజేస్తుంది. శత్రువుకు తెలిసిన విద్యలన్నీ మనకు తెలిసుండాలి కూడా.'' అని బోధించాడు. దళ సభ్యులు వారం పాటు ఆ గుర్రం మీద మూసీ ఇసుకలో స్వారీ నేర్చుకున్నారు.
''మనం స్థావరం మార్చాలి. పోలీసులు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ప్రస్తుతం మనకీ గుర్రం ప్రతిబంధకం. చూస్తే శత్రువు వెంటనే గుర్తుపడతాడు. శత్రువుకు దొరికితే మరింత ప్రమాదం. దీన్ని పట్టుకొచ్చిన అవసరం కూడ తీరింది.'' అని గుర్రాన్ని ఇస్తారికి అప్పజెప్పాడు. కమ్యూనిస్టుల్ని పట్టిచ్చిన పోలీసు గుర్రం మూసీ ఇసుకలో మట్టైపోయింది.
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories, pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu
0 Comments